జీవితం విలువ తెలుసుకోకుండా నేటి తరం యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవాళ్లకు కలకాలం కన్నీళ్లు మిగిల్చుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.పరీక్షల్లో తప్పినందుకో,ప్రేమ విఫలమైనందుకో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో అయితే ప్రేమించిన వ్యక్తి మాట్లాడలేదనో పెంపుడు జంతువులు మృతి చెందాయనో కారణాలకు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.తాజాగా చిన్న వయసులోనే బట్టతల వస్తుండడంతో మనస్తాపానికి గురైన 18 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని మాదాపూర్కు చెందిన బాధిత కుర్రాడు ఇంటర్ పూర్తిచేసి జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. గత కొంతకాలంగా తల వెంట్రుకలు రాలిపోయి క్రమంగా బట్టతల రావడంతో మనస్తాపానికి గురయ్యాడు. తల వెంట్రుకలు ఊడిపోతున్న విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి ఆవేదన వ్యక్తం చేశాడు.సోమవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లిన కుమారుడు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి తలుపుకొట్టింది. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వెంటనే భర్తకు సమాచారం అందించింది. ఆయన వచ్చి తలుపు పగలగొట్టి చూడగా కుమారుడు ఉరి వేసుకుని వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు.ఆయనిచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బట్టతల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.