తేజ్‌ బహదూర్‌ పిటిషన్‌ తిరస్కరణ

తేజ్‌ బహదూర్‌ పిటిషన్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ: వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి తాను వేసిన నామపత్రాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్‌ బహదూర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. ‘యాదవ్ వ్యాజ్యాన్ని స్వీకరించడానికి మాకు ఎటువంటి సరైన కారణాలు కనపడ లేదు’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘ధర్మాసనం ఇంతకు ముందు ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌లు వేయొచ్చు’ అని తేజ్‌ బహదూర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్ తెలిపారు. ‘ఎన్నికల ప్రక్రియకు విరుద్ధంగా చర్యలు ఉంటే ఎన్నికల అనంతరం మాత్రమే ఇందుకు సంబంధించిన వ్యాజ్యాల్ని వేయొచ్చు’ అని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది రాకేశ్‌ ద్వివేదివాదించారు. 2017లో బీఎస్‌ఎఫ్‌ జవానుగా విధులు నిర్వహించిన తేజ్‌ బహదూర్‌ ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తమకు పెడుతున్న ఆహార నాణ్యత బాగోలేదని తమ బాధను చెప్పుకున్నారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఈ ఎన్నికల్లో ఆయన సమాజ్‌ వాదీ పార్టీ తరఫున ప్రధాని మోదీపై పోటీకి దిగారు. ఆయన వేసిన నామ పత్రం తిరస్కరణకు గురి కావడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos