ముంబై : భారత దౌత్యాధికారులతో అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణపై టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం ఉద్వాసనకు గురయ్యారు. వెస్టిండీస్ పర్యటన నుంచి ఆయనను వెనుకకు పిలిపిస్తున్నారు. ఇకమీదట అతనికి ఎలాంటి పదవులు అప్పగించరాదని బీసీసీఐ యోచిస్తోంది. జల సంరక్షణపై క్రికెటర్లతో ఓ వీడియో చిత్రీకరించడానికి సహకరించాలని కరీబియన్ దీవుల్లోని భారత దౌత్యాధికారులు ఆయనను కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే తనను సందేశాలతో ముంచెత్తకండి అంటూ ఆయన వారితో అమర్యాదగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని దౌత్యాధికారులు ఢిల్లీకి చేరవేయడంతో క్రికెట్ పాలకుల కమిటీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనూ సునీల్ సుబ్రమణ్యంపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రతిసారి తప్పించుకుంటూ వచ్చారు.