భారత జట్టుకు ఇదేమీ కొత్త కాదు…

భారత జట్టుకు ఇదేమీ కొత్త కాదు…

అద్భుతంగా రాణించడం, అంతలోనే పేలవమైన ప్రదర్శన ఇవ్వడం అనేది భారత జట్టుకు కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు మానసిక పరిస్థితి పూర్వ స్థితికి పట్టడానికి కొంత సమయం పట్టవచ్చు. మే ౩౦ నుంచి ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. కనుక లోపాలను సరి చేసుకోవడానికి టీమిండియాకు బోలెడంత సమయం ఉంది. ఈలోగా ఐపీఎల్‌ ఉండనే ఉంది. భారత జట్టు ఆసీస్‌తో సిరీస్‌ కోల్పోవడానికి బ్యాట్స్‌మెన్‌ నిలకడలేనితనమే కారణంగా చెప్పవచ్చు. ఓపెనర్లు చాలా అరుదుగా రాణించారు. 250 లోపు ఉన్న లక్ష్యాన్ని కూడా మన బ్యాట్స్‌మెన్‌ ఛేదించలేకపోయారంటే..మన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కెప్టెన్‌ కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. కీలక సమయాల్లో బుమ్రా, భువనేశ్వర్‌లు కూడా చేతులెత్తేశారు. మన స్పిన్నర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఫర్వాలేదనిపించినా, చాహల్‌ వైఫల్యం కొంత కలవరపెడుతోంది. మన పిచ్‌లపై ఆసీస్‌ స్పిన్నర్‌ జంపా మన బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడంటే, అతనెంత కఠోర పరిశ్రమ చేసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. మూడు, నాలుగు వన్డేల్లో టాస్‌ గెలిస్తే ముందుగా ఏది ఎంచుకోవాలనే విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన తప్పిదం గుర్తు చేసుకోవాల్సిందే. నాగపూర్‌ మ్యాచ్‌లో సెకండ్‌ బ్యాటింగ్‌ చేసే వారు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తెలిసినా, కెప్టెన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మ్యాచ్‌ ఓడిపోయాక కోహ్లీ చెప్పిన సంజాయిషీ ఏమంటే…మంచు ప్రభావం వల్ల చివరన ఫీల్డింగ్‌ చేసే జట్టుకు ముప్పులు తప్పవనుకున్నామని, కానీ ఆసీస్‌కు అలాంటి ఇబ్బందేమీ రాలేదని…ఇక మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో రెండో సారి బ్యాటింగ్‌ చేసేవారే 90 శాతం గెలిచినట్లు దాఖలాలున్నా, మన వారు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌నే ఎంచుకున్నారు. చివరన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ల బౌలింగ్‌ను కూడా చీల్చి చెండాడారు. అసలు మన వాళ్లు బ్యాటింగ్‌ సమయంలో….ఏ మాత్రం బ్యాటింగ్‌ రాని బుమ్రా తను ఎదుర్కొన్న కేవలం ఒకే బంతిని సిక్సర్‌గా మలచడం చూస్తే…ఆ పిచ్‌ బ్యాట్స్‌మెన్‌ స్వర్గధామమని ఇట్టే తెలిసిపోతుంది. మొత్తానికి ఈ ఓటమి ద్వారా గుణపాఠాలు నేర్చుకుని టీమిండియా విశ్వ విజేతగా నిలుస్తుందని ఆశిద్దాం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos