టమోటా ధరల పతనం…ఆందోళనలో రైతులు

హొసూరు : టమోటాల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. హొసూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో టమోటా, బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళాదుంపలు,  క్యారెట్, బీట్రూట్ తదితర వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ ప్రాంత రైతులు పండిస్తున్న టమోటాలకు మంచి గిరాకీ ఉండేది. ఈ ప్రాంత టమోటాలను  కర్ణాటక, కేరళ, తమిళనాడులోని వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు.

గత వారం రోజులుగా హొసూరు మార్కెట్‌కు టమోటాలు ఎక్కువగా రావడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.  ప్రస్తుతం 20 కిలోల టమోటా ధర రూ.200 పలుకుతోంది. ఈ ధర తమకేమాత్రం గిట్టుబాటు కాదని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి  టమోటాలు రోజుకు 20 లారీలు చొప్పున హొసూరు మార్కెట్‌కు రావడంతో ధరలు పతనమయ్యాయని స్థానిక రైతులు వాపోతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో టమోటా విరగకాయడంతో ఆ ప్రభావం పడిందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ధరలను చూసి రైతులు పంటను పొలాల్లోనే వదిలి వేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos