ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన విధానం,తీరుతెన్నులు చూస్తుంటే అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేదా వేరే దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు.గురువారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన కేవలం ప్రచారాలు,ఆర్భాటాల్లో మాత్రమే కనిపిస్తోందంటూ విమర్శించారు.పదేపదే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటుతో కొట్టుమిట్టాడుతోందంటూ చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వేలకోట్ల ప్రజాధనాన్ని తన ఆర్భాటాలు,ప్ర,చారాల కోసం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించారు.ఐదేళ్లపాటు వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఎన్నికలకు రెండు నెలల ముందు పథకాల పేరుతో చంద్రబాబు ప్రజలను మరోసారి మభ్య పెట్టడానికి యత్నిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తామంటూ అమరావతిలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ విమర్శించారు.తన అవసరాలకు తగ్గట్టు ప్రత్యేక హోదాపై మాటలు మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర,ప్రజల భవిష్యత్తును ముఖ్యంగా యువత భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేసారంటూ ఆరోపించారు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అని అన్నారు. ప్రజాస్వామ దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చని తలసాని పేర్కొన్నారు. గతంలో తాను ఏపీకి వచ్చి వెళ్లాక మావాళ్లను వేధించారని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు కూడా చాలమంది మంత్రులు వస్తారని, వారిని పోలీసులు ఎందుకు వచ్చారని అడగరని అన్నారు. హాయ్‌ల్యాండ్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకుంటే ఇంటెలిజెన్స్ నుంచి ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా హాయ్ ల్యాండ్ లో బస చేస్తున్నానని హాయ్ ల్యాండ్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు బెదిరించారన్నారు. తాను ప్రెస్‌మీట్ పెట్టిన హోటల్ యాజమాన్యంపై కూడా ఒత్తిడి చేశారని, ఏపీలో ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని అన్నారు.