న్యూఢిల్లీ : దేశ గణతంత్ర దినోత్సవం వేడకల్లో కేరళ స్తబ్ధ చిత్ర ప్రదర్శనకు కేంద్రం తిరస్కరించింది. ఇందుకు గల సహేతుక కారణాల్ని వివరించ లేదు. నూతన పౌరసత్వ చట్టాన్ని కేరళ శాసనసభ తిరస్కరించటం తెలిసిందే. ఈ చట్టాన్ని వ్యతిరేకించిన మహారాష్ట్ర, పశ్చిమ బంగ, స్తబ్ధ చిత్రాల్ని ఇది వరకే తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే ఈ విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టారు. కేంద్రం చర్య మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలకు అవమానకరమని వ్యాఖ్యా నించారు. బంగ పై కేంద్రం వివక్షతతో వ్యవహరిస్తోందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందున రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని తృణమూల్ పార్లమెంటు సభ్యుడు సౌగతా రాయ్ అన్నారు.