ఢిల్లీ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఢిల్లీలోని బీజేపీ అగ్ర నేతలకు రూ.1,800 కోట్ల ముడుపులు సమర్పించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఓ వార్తా పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, బీజేపీ నేతలను అవినీతి సామ్రాట్టులుగా అభివర్ణించారు. అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా అనేక మంది బీజేపీ జాతీయ నాయకులకు, కొంత మంది న్యాయమూర్తులు, న్యాయవాదులకు యడ్యూరప్ప డబ్బు పంపకాలు జరిపినట్లు తన డైరీల్లో రాసుకున్నారని వెల్లడించారు. యడ్యూరప్ప సంతకంతో కూడిన డైరీని ఆదాయ పన్ను శాఖ అధికారులు 2017లో స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఇప్పటి వరకు లోతైన విచారణ చేపట్టలేదని ఆరోపించారు. వార్తా కథనంపై బీజేపీ నాయకులు తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.