మంగళవారం వేకువ జాము మూడు గంటలకు తమ గ్రామంలో పెద్ద శబ్దం వినబడిందని, బహుశా పిడుగు పడిందేమోనని అనుకున్నామని పాకిస్తాన్లోని జాబా గ్రామానికి ఎచందిన మహ్మద్ ఆదిల్ తెలిపాడు. భారత వైమానిక దళం జైష్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో అతను ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడాడు. శబ్దం వినిపించిన అనంతరం తాము నిద్రపోలేదని, కొద్ది సేపటికి అవి బాంబులు పేలిన శబ్దాలని తెలిసిందని చెప్పాడు. బాంబులు పడిన స్థలంలో తమ బంధువులున్నారని, వారిలో ఒకరు గాయపడ్డాడని వివరించాడు. కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయని, మొత్తం అయిదు బాంబు పేలిన శబ్దాలను విన్నామని చెప్పాడు. విమానాల చప్పుళ్లు కూడా వినిపించాయన్నాడు. తెల్లారాక కొన్ని బాంబు శకలాలను, నాలుగైదు ఇళ్లు నేలమట్టం కావడాన్ని చూశామని తెలిపాడు. కాగా బాలాకోట సమీపంలోని నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ స్థావరంపై వైమానిక దాడులు నిర్వహించినట్లు భారత విదేశ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే దిల్లీలో తెలిపారు. జైషే అధినేత మసూద్ అజర్ బావమరిది మౌలానా యూసుఫ్ అజర్ ఆధ్వర్యంలోని అతి పెద్ద శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేశామని కూడా ఆయన వెల్లడించారు. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. సాధారణ పౌరులకు ప్రాణ హాని కలుగకుండా ఈ దాడులు నిర్వహించామన్నారు.