కోల్‌కతా: రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి సరికొత్త రికార్డు సృష్టించింది. రోజుల వ్యవధిలోనే వందలాది శస్త్రచికిత్సలు నిర్వహించి అరుదైన ఫీట్‌ను సాధించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కోల్‌కతా లోని సేథ్ సుఖ్‌లాల్ కర్నానీ మెమోరియల్ హాస్పిటల్ నగరంలోని అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ వైద్య సదుపాయాల్లో ఒకటి. కోల్‌కతాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ ఆసుపత్రికి పెద్ద ఎత్తున రోజులు వస్తుంటారు. తాజాగా ఈ హాస్పిటల్ అరుదైన రికార్డు సృష్టించింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఏకంగా 200కిపైగా శస్త్రచికిత్సలు చేసి అరుదైన ఫీట్‌ను సాధించింది.డైరెక్టర్ మణిమోయ్ బెనర్జీ, డాక్టర్ అభిమన్యు బసు, డాక్టర్ దీప్తేంద్ర సర్కార్ సహా 30 మందికిపైగా వైద్యుల బృందం ప్రతి రోజూ 35 నుంచి 40 ఆపరేషన్లు చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఈ 200 సర్జరీలూ సక్సెస్ అయ్యాయట. ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఇలాంటి అద్భుతమైన ఫీట్ సాధించడం విశేషమే కద.ఈ విజయంతో రోగుల బంధువుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని.. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మరింత మెరుగుపడుతుందని పలువురు ఆశిస్తున్నారు. మరోవైపు SSKM హాస్పిటల్ టాటా మెమోరియల్ హాస్పిటల్‌తో కలిసి క్యాన్సర్ కేర్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా ఇక్కడ వైద్య సౌకర్యాలు మరింతగా మెరుగుపడతాయని స్థానికులు భావిస్తున్నారు.