తిరువనంతపురం: శబరిమల అయ్యప్పను దర్శించుకునే మహిళలకు రక్షణ కల్పించే ఆలోచనేమీ లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ శాంతియుత వాతావరణం కోసమే కృషి చేస్తుందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి దేవాలయం వద్ద యథాతథ స్థితిని కొనసాగించడమే సరైందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘శబరిమల ఆలయానికి ఎవరైనా మహిళలు వెళ్లదలిస్తే కోర్టు ఆదేశాలు తెచ్చుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 16న అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుంటానని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ ప్రకటించటం తెలిసిందే. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాద వ్యాజ్యాల విచారణ అత్యున్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి బదిలీ కావటం తెలిసిందే. స్వామి వారి దర్శనార్థం ఆలయ తలుపుల్ని శనివారం తెరవనున్నారు. కోర్టు తీర్పు లో సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళల ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటామమని ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ గురువారం పేర్కొనటం తెలిసిందే.