ఉరి నుంచి తప్పించుకోవడానికి నిర్భయ ఘటన దోషులు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నారు.రాష్ట్రపతికి,సుప్రీంకోర్టుకు పిటిషన్లపై పిటిషన్లు దాఖలు చేసుకుంటూ ఉరిశిక్షను ఎప్పటికప్పుడు వాయిదా వేసేలా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు.ఒకరి తరువాత మరొకరు పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరిని వాయిదా వేయించుకుంటున్నారు.ఇదిలా ఉంటే రాష్ట్రపతి రామనాథ కోవింద్ తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని ప్రశ్నిస్తూ నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తనకు సంబంధించిన మొత్తం రిపోర్టులను పంపించలేదని.అందుకే తనకు క్షమాభిక్షను ఏకపక్షంగా తిరస్కరించారని పిటిషన్ లో ముఖేశ్ పేర్కొన్నాడు. మొత్తం డాక్యుమెంట్లను రాష్ట్రపతికి పంపించాలని… జైల్లో తనను కొట్టారని, లైంగికంగా వేధించారనే విషయాన్ని తాను నిరూపించుకుంటానంటూ కూడా ముఖేశ్ సింగ్ తన పిటిషన్ లో కోరాడు. ఈ పిటిషన్ పై నిన్న వాదనలను విన్న ధర్మాసనం… తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు విచారణను చేపట్టిన ధర్మాసనం… ముఖేశ్ సింగ్ పిటిషన్ ను కొట్టి వేసింది. పిటిషన్ లో ముఖేశ్ కుమార్ పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రపతికి అన్ని డాక్యుమెంట్లు పంపించలేదనే ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది.కాగా నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో మూడో దోషి అక్షయ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారంనాడు అతను ఆ పిటిషన్ దాఖలు చేసినట్లు తీహార్ జైలు అధికారులు చెప్పారు.నిర్భయ కేసు దోషులు నలుగురికి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయడానికి డెత్ వారంట్ జారీ అయింది. ఈ స్థితిలో దోషులు న్యాయప్రక్రియకు సంబంధించిన అంశాలను వాడుకుంటూ ఆలస్యం చేసేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.