ముంబై : భార్య వేధింపులకు మరో భర్త తన జీవితాన్ని ముగించాడు. నిశాంత్ త్రిపాఠీ (41) సూసైడ్ నోట్‌ను తాను పని చేస్తున్న కంపెనీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి, హోటల్ గదిలో గత శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ తీవ్ర నిర్ణయానికి కారణం తన భార్య అపూర్వ పారిఖ్, ఆమె మేనత్త ప్రార్థన మిశ్రా అని ఆ సూసైడ్ నోట్‌లో తెలిపారు. “జరిగినదానికి ఈ చివరి క్షణంలో నేను నిన్ను ద్వేషించవచ్చు. కానీ నేను అలా చేయను. ఈ క్షణంలోనూ నేను ప్రేమను ఎంచుకున్నాను. అప్పుడూ నిన్ను ప్రేమించాను. ఇప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఎదుర్కొన్న అన్ని కష్టాల గురించి మా అమ్మకు తెలుసు. నా చావుకు నువ్వు, ప్రార్థన మౌసీ కూడా బాధ్యులు. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను, ఆమె దగ్గరికి వెళ్లకు. ఆమెను ప్రశాంతంగా ఏడవనివ్వు’ అని సూసైడ్ నోట్‌లో రాశారు. నిశాంత్ తన తల్లి, సోదరుడు, చెల్లెమ్మకు కూడా సందేశాన్ని రాశారు. చివర్లో తన భార్యపై ప్రేమను చాటుకుంటూ ఓ పద్యాన్ని కూడా రాశారు. సినీ రంగంలో యానిమేటర్‌గా పని చేస్తున్న నిశాంత్ పాల్ఘర్ జిల్లాలో నివసిస్తున్నారు. ఆయన ఫిబ్రవరి 28న ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు మూడు రోజుల ముందు ఆయన విలే పార్లేలోని ఓ హోటల్‌లో దిగారు. ‘డోంట్ డిస్టర్బ్’ అనే బోర్డును తన గది వద్ద వేలాడదీసి, ప్రాణాలు తీసుకున్నారు. ఆయన చాలాసేపు స్పందించకపోవడంతో హోటల్ సిబ్బంది మాస్టర్ కీతో తలుపులు తెరిచి చూశారు. ఆయన ఓ హుక్‌కు వేలాడుతూ కనిపించారు.