న్యూఢిల్లీ: కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో బాటు హా కేంద్ర ప్రభుత్వం పలు ప్రజా వ్యతిరేక విధానాలను అవంభి స్తోందని ఆరోపించిన కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బుధవారం సార్వత్రిక సమ్మె కట్టాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ‘మోదీ- షా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిరుద్యోగ సమస్య ఏర్పడుతోంది. మోదీ తన స్నేహితుల కోసం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు సంక్షోభానికి గురవు తున్నాయి. నేడు 25 కోట్ల మంది భారత్ సమ్మెలో పాల్గొంటున్నారు. వారికి నేను సెల్యూట్ చేస్తున్నాన’ని ట్వీట్ చేశారు. ముంబై, చెన్నై, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్యోగులు రోడ్లపై చేరి నినాదాలు రాసిన అట్టల్ని ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ముంబైలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు కేంద్ర నిర్ణయా లను వ్యతిరేకించి సమ్మెలో పాల్గొన్నారు. చెన్నైమౌంట్ రోడ్లో పది యూనియన్లకు చెందిన కార్మికులు సమ్మె కట్టి ప్రదర్శన చేసారు. పశ్చిమ్ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో కార్మికులు సమ్మెకు దిగారు హౌరా, కంచ్రపర, నార్త్ 24 పరగణాలు ప్రాంతాల్లోని రైల్వే పట్టాలపై నిరసనకారులు నిలబడి ఆందోళనకు దిగారు. దుర్గాపూర్లో జాతీయ రహదారిని ఆందోళనకారులు మూసి వేశారు. పుదుచ్చేరిలో సమ్మె ప్రశాంతంగా జరిగింది. రవాణా సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భువనేశ్వర్లో కార్మిక సంఘాల నేతలు రైలు పట్టాలపై నిలిచి రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. కార్మిక సంఘాల సమ్మెకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ తెలిపారు.