జూనియర్‌ డాక్టర్ల నిరవధిక సమ్మె

జూనియర్‌ డాక్టర్ల నిరవధిక సమ్మె

హైదరాబాదు:తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. దీనిలో భాగంగా సోమవారం ఉస్మానియా మెడికల్ కాలేజీలో ధర్నా చేశారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 4 వేల మంది సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. స్టయిఫండ్ చెల్లింపులతోపాటు 8 డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గత నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ వైద్యశాఖ మంత్రి కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని జూడాలు వాపోయారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు దిగినట్లు తెలిపారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లు ఇవే..
ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ జమచేసేలా గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పోలీసులతో భద్రత కల్పించాలి.
పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలి.
కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్లో అంతర్గత రోడ్లు వేయాలి.
సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెండ్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలి.
ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలి.
హాస్టల్ భవనాలను నిర్మించకపోవటంతో పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలి.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos