స్టీవ్‌ స్మిత్‌కు అవమానమా…

  • In Sports
  • February 20, 2021
  • 168 Views
స్టీవ్‌ స్మిత్‌కు అవమానమా…

మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకెల్ క్లార్క్, స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలంలో స్టీవ్ స్మిత్‌ను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లార్క్, స్మిత్ కొనుగోలుపై స్పందించాడు. ‘ఇంత తక్కువ ధర పలికిన స్మిత్ ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇండియా ఫ్లైట్ ఎక్కే తరుణంలో ఏదో ఒక కారణం చెప్పి స్మిత్ దూరంగా ఉంటాడు. గత సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను వేలంలో ఇప్పుడొచ్చిన ధరతో అవమానంగా ఫీలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తరంలో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లో స్మిత్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కోహ్లి టాప్‌లో ఉంటే స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఒక్క ర్యాంక్ మాత్రమే తేడా ఉంది. స్మిత్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌ అని చెప్పడానికి ఈ ఒక్క అర్హత చాలదా. తక్కువ ధరకు అమ్ముడుపోయిన స్మిత్ 11 వారాల పాటు తన కుటుంబానికి దూరంగా ఉంటాడని మాత్రం అనుకోవట్లేదు. ఒకవేళ అతను ఐపీఎల్ ఆడాలని భావించినా మధ్యలోనే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.’ అంటూ చెప్పుకొచ్చాడు.
గత సీజన్‌లో స్మిత్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. 14 మ్యాచులు ఆడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అటు స్మిత్  14 మ్యాచులలో 311 పరుగుల సాధించి విఫలమయ్యాడు, దీంతో రాయల్స్ స్మిత్‌ను రిలీజ్ చేసి అతని స్థానంలో సంజూ శామ్సన్‌ను  కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos