చెన్నై: ‘మదురైలో డీఎంకే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిద్దాం… 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుదాం’ అంటూ డీఎంకే కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ బహిరంగ లేఖ రాశారు. తన సారథ్యంలోని ద్రావిడ మోడల్ ప్రభుత్వ పనితీరుపై ఏదో ఒక విమర్శ చేయాలన్న ధోరణితోనే విపక్షాల వ్యవహారశైలి ఉంది. వచ్చే ఎన్నికల్లో బలమైన డీఎంకే కూటమిని ఎదుర్కోలేక అనేక పార్టీలను కలుపుకుని కూటమిగా ఏర్పడటం లేదా రహస్యంగా సమావేశమై మంతనాలు జరుపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా మదురైలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని భావించి, స్థలాన్ని కూడా రాష్ట్ర మంత్రులు కేఎన్ నెహ్రూ, ఏవీ వేలు, తంగం తెన్నరసు పరిశీలించారని, జూన్ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు మదురైలో పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని స్టాలిన్ తెలిపారు.. ఈ సమావేశం విజయవంతమయ్యేలా సర్వసభ్యులతో పాటు పార్టీ నేతల సహాయ సహకారాలందించాలి. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపునిచ్చారు.