న్యూ ఢిల్లీ: ప్రజలకు టీకాలు వేయటంలో ప్రభుత్వానికి ముందు చూపు మందగించటమే టీకాల కొరత సమస్య ఎదురైందని సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ విమర్శించారు. హీల్హెల్త్ సంస్థ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేంద్రం తొలుత మూడు కోట్ల మంది ఫ్రంట్లైన్ వారియర్లకు మాత్రమే టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. దానికి తగ్గట్టే మేము ప్రభుత్వానికి ఆరు కోట్ల డోసుల టీకాలు సరఫరా చేశాం. ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించకుండానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పరిమితమే అని తెలిసీ కూడా 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లకు… టీకాలు తీసుకుంటున్న జనాలకు మధ్య పొంతన లేకుండా పోయింది. దాని ఫలితమే నేడు టీకాల కొరతకు దారి తీసింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న టీకాల కొరత మనకో గుణపాఠం లాంటింది. ఉత్పత్తి సామర్థ్యం, నిల్వల ఆధారంగా టీకాలు వేయడం సరైన పద్దతి. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నియమాల్ని పాటించాలి. కరోనాను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే పరిష్కారమని తెలిసి కూడా కొందరు దాన్ని వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అని సందేహాలు వ్యక్తం చేస్తుంటార’ని పేర్కొన్నారు.