అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌ను నియమించవచ్చని సమాచారం. డిప్యూటీ స్పీకర్‌గా పీ. రాజన్న దొరకు అవకాశం కల్పిస్తారని వైకాపా వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా హయాంలో ఆయన మంత్రిగా పని చేశారు. కాగా ప్రొటెం స్పీకర్‌గా శంబంగి వెంకట చిన అప్పలనాయుడును నియమించనున్నారు. ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి గెలుపొందారు. ఈ నెల 12 నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం సచివాలయ ప్రాంగణంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.