కరాడ్ : శివసేన- కాంగ్రెస్- ఎన్సీపీల కూటమే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్రావు చవాన్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సోమ వారం ఇక్కడకు వచ్చారు. చవాన్ స్మారకం ‘ప్రీతి సంగమ్’ వద్ద పవార్ నివాళుల ర్పించిన తర్వాత విలేఖరులతో మాట్లా డారు. ‘భాజపాతో చేతులు కలిపింది అజిత్ పవారే తప్ప ఎన్సీపీ కాదు. ఇది ఎంతమాత్రమూ మా పార్టీ నిర్ణయం కాదు.ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మేము అంగీకరించ బోమ’ని పవార్ స్పష్టీకరించారు. అజిత్ పవార్ను పార్టీ నుంచి బహిష్కరణ గురించి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంకా ‘నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చాలా చూశాను. క్లిష్ట పరిస్థితులు వస్తాయి. అవన్నీ తాత్కాలికమే. రాష్ట్ర ప్రజలు బలంగా నిలబడతారనేది నా అనుభవం. నాకు యువకుల సహ కారం ఉంది. ఏదో జరిగిపోతుందన్న ఆందోళన లేద’న్నారు. పవార్ వెంట సతారా లోక్సభ సభ్యుడు శ్రీనివాస్ పాటిల్ తదితరు లున్నారు.