
లఖ్నవూ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయక పోవటం ఆ పార్టీ అంతర్గత నిర్ణయమని గురువారం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో పొత్తులో ఉన్న ఇతర అభ్యర్థుల గెలుపునకు మాయావతి కృషి చేస్తారని బీఎస్పీ చేసిన ప్రకటన హర్షణీయ మన్నారు. ‘బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ పొత్తు మంచి భావాలు, ఆలోచనలతో కూడిన కూటమి. ఇది సాధారణ ప్రజల కూటమి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏర్పాటైన పొత్తు. ఇది దేశాన్ని ముందుకు నడిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. దేశంలో కొత్త ప్రభుత్వం నెలకొంటుందని ఈ రంగుల పండుగ హోలీ సందర్భంగా తాను ఆశించినట్లు చెప్పారు.ఒకవేళ అవసరమైతే లోక్సభ ఎన్నికల తర్వాత ఎవరైనా ఒక లోక్ సభ సభ్యుణ్ని రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని మాయవతి గతంలో పేర్కొనటం ఇక్కడ ఉల్లేఖనార్హం. 1995లో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినపుడు తాను రాష్ట్ర విధానసభ, విధాన పరిషత్తు సభ్యురాలిని కూడా కాదని గతాన్ని గుర్తు చేశారు. దీంతో ఆమె ప్రధాన మంత్రి పరుగు పోటీలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.