హొసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన లావణ్య హేమానాథ్ సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించారు. సూలగిరి యూనియన్‌లోని పన్నపల్లి, చుట్టుపక్కల గ్రామాలలో పర్యటించిన ఆమె గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పన్నపల్లిలో తాగు నీటి సదుపాయం కల్పించాలని, మాధ్యమిక పాఠశాలకు అన్ని వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రామంలో మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కరించారు. సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పన్నపల్లి గ్రామ ప్రజలకు
సూచించారు. అదేవిధంగా చుట్టుపక్కల పలు గ్రామాలకు వెళ్ళే రోడ్లు అధ్వానంగా ఉండడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆమె వెంట జిల్లా కౌన్సిలర్ వెంకటాచలం, బీడీవో బాలాజీ, పన్నపల్లి పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ్ గౌడ, యూనియన్ వైస్ చైర్మన్ మాదేశ్, యూనియన్ కౌన్సిలర్లు రాజారాం, మునిచంద్రప్ప, మునేగౌడ, లోకేష్, అధికారులు పాల్గొన్నారు.