న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్, తదితర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని డిమాండు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. మార్కెట్లో లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బీ కొరతనూ ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. బ్లాక్ ఫంగస్ (మ్యుకొర్మైకోసిస్)ను అంటువ్యాధుల చట్టం ప్రకారం అంటువ్యాధిగా ప్రకటించాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాధి చికిత్సకు మందులు సరఫరా అయ్యేలా చూడాలని, రోగుల సంరక్షణకు ఉచిత సేవలు అందించాలని కోరారు. చికిత్సకు అవసరమైన లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బీ మందు కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి ఎక్కువగా కోవిడ్-19 రోగుల్లో కనిపిస్తోంది. కంటి చూపు తగ్గడం లేదా, డబుల్ విజన్, ఛాతీ నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు ఈ వ్యాధి లక్షణాలు. కేంద్రం లెక్కల ప్రకారం, మే 21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.