న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వలస కార్మికుల దుస్థితి ఏ మాత్రం పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం దుయ్యబట్టారు. ప్రతి పేద కుటుంబానికి వచ్చే ఆరు నెలల పాటు 7,500 రూపాయల చొప్పున నగదును అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గురువారం నుంచి దేశ వ్యాప్తంగా పేదలు, కార్మికులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దురవస్థపై గొంతెత్తే ఆందోళన చేపట్టింది. ‘వలస కార్మికులు పాదాలకు ఎలాంటి రక్షణా లేకుండా, పాద రక్షలు లేకుండా వందల కిలోమీటర్లు నడిచి పోతున్నారు. వారూ, పేద ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఇంతటి వ్యధ అనుభవించడం ఇదే ప్రథమం. వలస కార్మికుల దీనావస్థ, దుస్థితి దేశం మొత్తం గ్రహించింది. కానీ కేంద్రం మాత్రం గ్రహించడం లేద’ని సోనియా విమర్శించారు. ‘లాక్ డౌన్ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు, వలస కార్మికుల అవస్థలను దూరం చేయాల్సిన సమయం ఇదే. కాంగ్రెస్ నేతలు, మేధావులు, దేశంలోని ప్రముఖులు మొదటి నుంచీ మొత్తుకుంటూనే ఉన్నారు. మోదీ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా లేదు. పేదలకు ఆరు నెలల పాటు నెలకు రూ.7,500లు అందించాలి. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.పది వేల వంతున జమ చేయాలి. వలస కార్మికులు తమ స్వస్థలాలకు క్షేమంగా చేరుకునేలా చూసే బాధ్యత కేంద్రానిదే. వారికి ఉపాధి అవకాశాలూ కేంద్రమే కల్పించాల’ని డిమాండ్ చేశారు.