న్యూ ఢిల్లీ : పని గంటల పెంపు అంశంపై పలువురు కార్పొరేట్ దిగ్గజాలు చేస్తున్న వ్యాఖ్యలపై దేశమంతా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. పనిగంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.”కార్మికుల, ఉద్యోగుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పరిధిలోని కార్మిక చట్టాలను అమలు చేస్తాయి. కేంద్రం తరఫున సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెషనరీ (సీఐఆర్‌ఎం) తనిఖీ అధికారులతో పర్యవేక్షణ చేస్తుండగా, రాష్ట్రాలు ఆయా విభాగాల ద్వారా దీనిని అమలు చేస్తాయి” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఆయా రాష్ట్రాల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టుల ద్వారా పని గంటలు, ఓవర్ టైం సహా వర్కింగ్ పరిస్థితులను నియంత్రిస్తాయని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి వారానికి 60 గంటలకు పైగా పని చేస్తే, అది అతని/ ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని ఇటీవల ఆర్థిక సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో వర్కింగ్ అవర్స్ అంశంపై వెలువడిన పలు పరిశోధనలను ఉదహరించడం జరిగింది. రోజుకు 12 గంటలు, అంతకుమించి కూర్చుని పనిచేసే వారు (డెస్క్ వర్క్) తీవ్ర నిస్పృహకు లేదా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది.