కొత్త రాజకీయ పార్టీ దిశగా సిద్దరామయ్య అడుగులు?

కొత్త రాజకీయ పార్టీ దిశగా సిద్దరామయ్య అడుగులు?

 రోజురోజుకు మరింత సంక్షోభం దిశగా పయనిస్తున్న కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య శ్రీకారం చుట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపరచి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్దరామయ్య అడుగులు వేస్తున్నారనే చర్చలు మొదలయ్యాయి.మొదటి నుంచి సంకీర్ణ ప్రభుత్వంపై కొంత అసహనంగానే ఉన్న సిద్దరామయ్య సంకీర్ణంలో కాంగ్రెస్‌ నేతలకు ముఖ్యంగా తనకు ప్రాధాన్యత దక్కకపోవడంతో మరింత అసహనంతో రగిలిపోయారని తెలుస్తోంది. పరిపాలనలో కూడా ప్రతీశాఖలోనే సీఎం కుమారస్వామి, ప్రజాపనులశాఖ మంత్రి హెచ్‌డీ రేవణ్ణల జోక్యం ఎక్కువైందని మరోవైపు జేడీఎస్‌ అధినేతల కుటుంబ సభ్యులు కూడా పరిపాలనలో వేలు పెడుతుండడాన్ని కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్‌ మంత్రులు,ఎమ్మెల్యేలు సైతం సహించలేకపోయారు.ఈ పరిణామాలను నిశితంగా గమనించిన సిద్దరామయ్య సమయం చూసి తన ప్రణాళికను అమలు చేసినట్లు తెలుస్తోంది.జేడీఎస్‌తో పాటు తనకు అత్యంత ఆప్తులైన ఎమ్మెల్యేలతో రాజీనామాల చేయించి అసమ్మతి పర్వానికి తెర తీయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా మరికొంత మంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్య సూచన మేరకు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇలా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపరచి తనతో వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర సీనియర్‌,కీలక నేతలతో కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్దరామయ్య సన్నాహాలు చేసుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హస్తం ఉన్నట్లు పసిగట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం సిద్దరామయ్యకు మళ్లీ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అసంతృప్త ఎమ్మెల్యేలు సైతం సిద్దరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే రాజీనామాలు ఉపసంహరించుకుంటామంటూ కాంగ్రెస్‌ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం నిలబడాలన్నా,కాంగ్రెస్‌ పార్టీ ఉనికి చాటుకోవాలన్నా సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవి తప్పక ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీకే శివకుమార్పరమేశ్వర్ సుముఖంగా లేరని తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన రోజు చేసుకున్న ఒప్పందం ప్రకారం కుమారస్వామికే ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగే అవకాశం ఇవ్వాలని పరమేశ్వర్ డీకే శివకుమార్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్జేడీఎస్ మధ్య కొట్లాటను పసిగట్టిన ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య పక్కా ప్రణాళిక ప్రకారమే రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో మంత్రి డీకే శివకుమార్ అసంతృప్తులను బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడాలని చెబుతున్న సిద్ధరామయ్య మాత్రం తనదైన శైలిలో కుమారస్వామికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ లోనే సిద్ధరామయ్యకు శత్రువులు ఏర్పడ్డారు. సిద్ధూకు సీఎం పదవి ఇవ్వడంపై మంత్రి డీకేమాజీ ఎంపీ మల్లికార్జునఖర్గేడిప్యూటీ సీఎం పరమేశ్వర్ కు ఇష్టం లేదు. దీంతో సిద్ధరామయ్య మాత్రం తన అనుచరులతో రాజీనామాలు చేయిస్తూనే ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కితే ప్రభుత్వాన్ని నిలబెట్టాలని లేని పక్షంలో తన ప్రణాళిక ప్రకారం తనకు అత్యంత ఆప్తులైన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి సంకీర్ణాన్ని కూల్చి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయంగా ఎదగాలని సిద్దరామయ్య వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.సంకీర్ణ ప్రభుత్వం నిలబడాలన్నా,బీజేపీకి అధికారం దక్కాలన్నా అసలు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడ్డ సంక్షోభానికి తెరపడాలన్నా సిద్దరామయ్య తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది..

 

 

 

 

 

 

 

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos