బెంగుళూరు: ప్రైవేటు కంపెనీల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కోటాను రాష్ట్ర ప్రజలకే కేటాయిస్తున్నట్లు రూపొందించిన బిల్లుపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో మంగళ వారం ఓ పోస్టు చేశారు. ఆ పోస్టుపై వ్యతిరేకత రావడంతో దాన్ని ఆయన డిలీట్ చేశారు. అయితే ప్రైవేటు కంపెనీల్లోని నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 70 శాతం, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం స్థానిక రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ క్లారిటీ ఇచ్చారు. కన్నడ ప్రజలకే తమ ప్రభుత్వం అధిక అవకాశాలు ఇవ్వనున్నట్లు బిల్లుపై మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సీఎం ప్రకటించిన నిర్ణయం పట్ల వ్యాపార వేత్తల్లో సరైన స్పందన రాలేదు. బెంగుళూరులోని ఐటీ పరిశ్రమ ఆ నిర్ణయం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బయోకాన్ సీఈవో కిరణ్ మజుందార్ షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్కిల్డ్ లేబర్ విధానంపై విమర్శలు చేశారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని మరవరాదు అని ఆమె అన్నారు.