దుబాయ్: ఐపీఎల్‌లో ఫీల్డ్ అంపైర్ తప్పిదం పంజాబ్‌ను విజయానికి దూరం చేసింది. చెన్నై, ముంబై మధ్య తొలి మ్యాచ్ మామూలుగా సాగిపోయినా, ఢిల్లీ-పంజాబ్ మధ్య ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ మాత్రం అసలైన మజా అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. మయాంక్ అగర్వాల్ పోరాట పటిమతో పంజాబ్ గెలుపు దిశగా పయనించింది. అయితే, అనూహ్యంగా అగర్వాల్ ఔటవడంతో… మ్యాచ్ టైగా ముగిసింది. చివరి వరకూ లక్ష్యం చేతులు మారుతూ వచ్చిన ఈ మ్యాచులో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది. అయితే, అంపైర్ల తప్పుడు నిర్ణయంతో తమకు అన్యాయం జరిగిందని పంజాబ్ అభిమానులు సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. టెక్నాలజీ జోక్యం ఎక్కువ కావడంతో అంపైర్ల బుద్ధి మందగించిందని చురకలు వేస్తున్నారు. పంజాబ్ యజమాని ప్రీతి జింటా కూడా అంపైర్లను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. విషమేమిటంటే.. 157 పరుగుల లక్ష్య ఛేదనలో మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్ గెలుపు దిశగా సాగుతోంది. బ్యాట్‌తో మెరిసిన ఢిల్లీ ఆటగాడు స్టొయినిస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న మయాంక్ షాట్ కొట్టడంతో రెండు పరుగులొచ్చాయి. అయితే, ఓవర్ పూర్తవగానే.. పంజాబ్ ఇన్నింగ్స్‌కు అంపైర్లు ఒక పరుగు కోత విధించారు. నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ తొలి పరుగు తీసే క్రమంలో షార్ట్ రన్ చేశాడంటూ చెప్పారు. దాంతో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 13 పరుగులు కావాల్సిన తరుణంలో 12 పరుగులు చేసిన తర్వాత మయాంక్ క్యాచ్ ఔట్గా వెనుదిరగడంతో ఒక్కసారిగా ఉత్కంఠ. ఇక చివరి బంతికి జోర్డాన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్ ఓవర్లో పంజాబ్ రెండు పరుగులే చేయడంతో ఢిల్లీ మూడు పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది. టీవీ రీప్లేలో మాత్రం జోర్డాన్ పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది.