హైదరాబాద్: నుమాయిష్‌లో బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆధారాల సేకరణపై పోలీసులు, ఆధారాల బృందం 24 గంటల్లోనే పురోగతి సాధించింది. ఘటనా స్థలంలో సేకరించిన శకలాలు, రసాయన పరీక్షలు, త్రీడీ టెక్నాలజీ నైపుణ్యంతో తీసిన చిత్రాల ఆధారంగా విద్యుదాఘాతంతోనే నిప్పంటుకుందని పోలీస్ అధికారులు, క్లూస్‌టీం సభ్యులు తేల్చారు. విద్యుదాఘాతం ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసుకునేందుకు మరిన్ని శకలాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. శనివారం ఫలితాలు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రెండు అంశాలపై దృష్టి: సంఘటనా స్థలంలో క్లూస్ బృందం సభ్యులు… వందల సంఖ్యలో ప్లాస్టిక్, క్రాకరీ, సింథటిక్ వస్తువులు, చీరలు, ఆహారపదార్థాల శాంపిళ్లను గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సేకరించారు. అనంతరం తొలుత నిప్పంటున్న మహేష్ బ్యాంక్ స్టాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేశారు. మంటల ధాటికి కరిగిపోయిన వైర్లను పరీక్షించారు. స్టాల్లో ఉన్న విద్యుత్ తీగల్లో కొన్నింటిపై వైరింగ్ సరిగా లేకపోవడం లేదా వెలుగుతున్న లైట్‌పై వర్షం లేదా నీటి చుక్కలు పడినప్పుడు ఉత్పన్నమైన వేడి ద్వారా నిప్పంటుకుని ఉండొచ్చని ఫోరెన్సిక్ బృందం పోలీసులకు తెలిపింది.