వైసీపీపై ఉన్న కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపిస్తారా

వైసీపీపై ఉన్న కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపిస్తారా

నందిగామ: ఇక్కడి గాంధీ సెంటర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై ఉన్న రాజకీయ కోపాన్ని ప్రజానాయకుడు వైఎస్‌ఆర్ విగ్రహాలపై చూపించడం దారుణమని ఆమె విమర్శించారు.”వైఎస్ఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చివరి క్షణం వరకు ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి దిశానిర్దేశం చేశాయి. అలాంటి మహానేత పేరు పెట్టుకున్నంత మాత్రాన వైఎస్ఆర్… వైసీపీ సొంతం కాదు, పేటెంట్ హక్కు కాదు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడి విగ్రహాలను కూల్చడం ఎక్కడి దిక్కుమాలిన చర్య?” అని షర్మిల ప్రశ్నించారు.నందిగామ గాంధీ సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించడంపై తమకు అభ్యంతరం లేదని, కానీ అదే సాకుతో విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని ఆమె స్పష్టం చేశారు. “మహానేత మరణం తర్వాత నాటి ప్రభుత్వం గాంధీ సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని తొలగించడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం” అని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చడం ద్వారా ప్రజాభిమానాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశం స్పష్టమవుతోందని షర్మిల విమర్శించారు. “వైసీపీకి వైఎస్ఆర్ విగ్రహాలకు సంబంధం లేదు. ఆ విగ్రహాలను కూల్చడం ద్వారా ప్రజల మనోభావాలను అవమానపరుస్తున్నారు. తొలగించిన చోట వెంటనే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాం” అని ఆమె హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos