
హైదరాబాదు:‘ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడిది రోజుకో మాట, పూటకో వేషం. ఆయన్ను చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతుంది. పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు’అని వై.ఎస్.షర్మిల చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. సోమవారం ఇక్కడ వైకాపా కార్యాలయంలో మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు జగన్ ధర్నాలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశ పెట్టాం . వైకాపా లోక్‌సభ సభ్యులు రాజీనామాలు కూడా చేశారు. మొదట్లో ప్రత్యేక ప్యాకేజీ అని జపం చేసిన చంద్రబాబు ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం డిమాండు చేసేలా చేసింది జగనే’ అని స్పష్టీకరించారు. జగన్ ఆందోళనకు దిగక పోయి ఉంటే చంద్ర బాబు ప్రత్యేక ప్యాకేజితో సరిపెట్టుకుని రాష్ట్ర ప్రజల్ని వంచించేవారని మండి పడ్డారు. జగన్ అవినీతికి పాల్పడి ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవారని విపులీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆవగింజంతా కానరావటం లేదన్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రం కళ కళ లాడిందని, ఇప్పుడు వెల వెల బోతోందని అభివర్ణించారు.‘వై.ఎస్ పాలనలో పేదలు, రైతులు ధైర్యంగా ఉండేవాళ్లు. ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించారు. పార్టీల కతీతంగా అన్ని సామాజిక వర్గాలకూ మేలు చేసార’ని పేర్కొన్నారు. చంద్రబాబు పాలన రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి నెట్టిందని దుయ్యబట్టారు. ‘చంద్రబాబు ది అధికార దాహం. దాని కోసం అబద్దాలాడారు. పసుపు-కుంకుమ పేరుతో మహిళల్ని మభ్యపెట్టి వంచించారు. పోలవరాన్ని మూడేళ్లల్లో పూర్తి చేస్తామన్నారు. పూర్తయ్యిందా? చంద్రబాబుది మాటమీద నిలబడే నైజం కాదు“ అని విమర్శ నాస్త్రాలు ప్రయోగించారు.‘ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన తర్వాత తను మొదటి సంతకాన్ని చేసిన దస్త్రాన్ని కూడా అమలు చేయలేదు. 87 వేల కోట్ల రైతు రుణాలను 24వేల కోట్లకు కుదించారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. వాటిని మాఫీ చేయలేమని మంత్రి సునీత విధానసభలో ప్రకటించలేదా..? పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెట్టడం లేదా..? కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి లాగేసుకో లేదా..? అమరావతిలో ఎకరా రూ.4 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.50 లక్షలకు తీసుకున్నారు. రాజధాని భూముల్ని బినామీలకు కట్టబెట్టారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కట్ట లేదు. హైదరాబాద్‌లోని ఇంటి కోసం చంద్రబాబు ప్రజల డబ్బును వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఆరోగ్యశ్రీ జాబితా నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల్ని తొలగించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి వెళ్తారా?” అని నిప్పులు కక్కారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఏమైంది..? అని ప్రశ్నించారు. ‘ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.లక్షా 20 వేలు బాకీ పడ్డారు. అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఎక్కడ చూసినా మాఫియా రాజ్యమేలుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలిచ్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ కొత్త అబద్దాలు, మోసపు హామీలిస్తున్నారు. పాత హామీలు నెరవేర్చకుండా కొత్త ఎన్నికల ప్రణాళిక ఎందుకు?అని దుయ్యబట్టారు.