కుప్పకూలిన షేర్ మార్కెట్

కుప్పకూలిన షేర్ మార్కెట్

ముంబయి: దలాల్‌ స్ట్రీట్‌ బేర్‌మంది. ఆద్యంతం అమ్మకాల ఒత్తిడితో కుదేలైంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా సాగాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. దీనికి తోడు టాటామోటార్స్‌ లాంటి దిగ్గజ షేర్లు భారీగా పడిపోవడం మార్కెట్‌ను కుదిపేసింది. ఫలితంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 11వేల మార్క్‌ను కోల్పోయింది. మార్కెట్‌ ఆరంభం నుంచే సూచీల నష్టకష్టాలు మొదలయ్యాయి. ఆటోమొబైల్, లోహ, వినియోగ తదితర కీలక రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు బలహీనంగా ప్రారంభించాయి. 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌.. అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఏ దశలోనూ కోలుకోలేని సూచీ చివరకు 425 పాయింట్లు పతనమై 36,546 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 126 పాయింట్ల నష్టంతో 10,944 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.19గా కొనసాగుతోంది.

కుప్పకూలిన టాటా మోటార్స్‌ షేర్లు..

త్రైమాసిక ఫలితాల ప్రభావంతో వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ షేర్లు నేడు భారీగా పతనమయ్యాయి. షేరు విలువ 18శాతం వరకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టాటామోటార్స్‌ రూ. 26,960.8 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలు కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇక దశలో 29.5శాతం నష్టంతో షేరు విలువ ఏడాది కనిష్ఠానికి పడిపోయింది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 17.88శాతం నష్టంతో రూ. 150.15 వద్ద స్థిరపడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos