న్యూ ఢిల్లీ : మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు భాజపా నిస్సిగ్గుగా వ్యవహరించి, మూడు పార్టీల కూటమి అధికారంలోకి రాకుండా అన్నివిధాలా కుట్రలు పన్నిందని కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ విమర్శించారు. గురువారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రవర్తనా అసమంజసమని, నిందార్హమైన రీతిలో వ్యవహరించారని ఆరోపించారు. ‘ప్రధాని, హోం మంత్రి ఆదేశాల ప్రకారమే ఆయన (కోష్యారి) వ్యవహరించారనడంలో సందేహమే లేదు. ఎన్నికల ముందు పొత్తును భాజపా కేవలం దురహంకారం, మితిమీరిన విశ్వాసంతోనే నిలబెట్టుకో లేదు. పైగా, మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అన్ని విధాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మనం అత్యతున్నత న్యాయస్థానానికి వెళ్లటంతో, మోదీ-షా బండారం బయటపడింది. నేను కచ్చితంగా హామీ ఇస్తున్నాను. భాజపా కుతంత్రాలను మూడు పార్టీలు సమిష్టిగా తిప్పికొడతాయ’న్నారు. రైతులు, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతినటంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్నారు. ఎగుమ తులు తగ్గిపోయాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఇల్లు గడవడమే సంక్షిష్టంగా మారుతోందని, ఈ సమస్య లను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి బదులు మోదీ-షా ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని తప్పుపట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను తమకు అనుకూలంగా ఉండే కొందరు వాణిజ్యవేత్తలకు అమ్మేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆయా సంస్థల్లో పనిచేసే వేలాది మంది కార్మికుల బతుకులు ఏమి కావాలని ఆమె ప్రశ్నించారు. బ్యాంకుల్లో దాచుకున్న డిపా జిట్లు ఏమైపోతాయోనని వేతనజీవులు, సాధారణ కుటుంబాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కమంటూ కాలం గడుపుతు న్నార న్నారు.