ఏపీలో నేటి నుంచి వాహనాలకు ఒకే సిరీస్‌

ఏపీలో నేటి నుంచి వాహనాలకు ఒకే సిరీస్‌

అమరావతి: ‘ఒక రాష్ట్రం – ఒక సీరీస్’ పేరిట ఏపీ రవాణా శాఖ వినూత్న విధానాన్ని ప్రారంభించింది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేసే కొత్త వాహనాలకు AP 39 సిరీస్‌తో వాహనాల నెంబర్లు కేటాయించనున్నారు. అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఇవాల్టి నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. విజయవాడలో ఈ నూతన విధానాన్ని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ వాహనాలకు జిల్లాకో కోడ్‌ చొప్పున కేటాయించేవారు. ఇకపై ప్రతి జిల్లాలో ప్రతి కొత్త వాహనానికి AP 39 సిరీస్‌తో నెంబర్లు కేటాయించనున్నారు. ఆర్టీసీ వాహనాలకు AP 39Z, పోలీస్‌ వాహనాలకు AP 39P, రవాణా వాహనాలకు AP 39T, సహా U,V, W, X, Y సిరీస్‌ కేటాయించారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ‘ఒకే రాష్ట్రం – ఒకే సిరీస్’ విధానానికి శ్రీకారం చుట్టామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో రవాణా శాఖ అంటే ప్రజల్లో అవినీతి శాఖ అనే అభిప్రాయం ఉండేదని, సాంకేతికతతో అవినీతిని పూర్తి స్థాయిలో నివారించామన్నారు. మిగిలిన అన్ని విభాగాల్లో కెల్లా ఉత్తమ విభాగంగా నిలిపామన్నారు. రవాణా శాఖ సేవలన్నీ సత్వరం ప్రజలకి అందుబాటులో తేవాలని తాను బాధ్యతలు చేపట్టినపుడు చంద్రబాబు ఆదేశించినట్లు రవాణా శాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ రూపొందించి కేవలం 58 రోజుల్లో అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌లోకి తెచ్చామని ఆయన వివరించారు. వాహనం కొన్నవారికి పర్మినెంట్ నెంబర్ రావడానికి గతంలో రెండు నెలలకుపైగా వేచి చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు వాహనం కొన్న వెంటనే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి అమలు చేస్తున్నామన్నారు. రవాణా శాఖ లోని 83సేవల్లో 70 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నామని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos