దేశాలను,రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించాలంటే కేవలం ప్రభుత్వాలు,మంత్రుల వల్ల మాత్రమే సాధ్యం కాదు.అధికారులు,ప్రజలను కూడా కలుపుకొంటూ వారితో సవ్యంగా మెలుగుతూ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి.అప్పుడే ఎటువంటి సమస్యలనైనా అవలీలగా అధిగమించి అభివృద్ధి సాధ్యమవుతుంది.అంతేకానీ మేమేదో మంత్రులమని మేము చెప్పిందే వేదమని మా ఆదేశాలు అధికారులకు శిరోధార్యాలని దర్పం ప్రదర్శిస్తే అధికారులకు, ప్రభుత్వాలకు మధ్య సత్సంబంధాలు దెబ్బతిని అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది.ఇంతకు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మంత్రుగా ఉన్న కొంతమంది ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు.అటెండర్ నుంచి అధికారి వరకు ప్రతిఒక్కరిని గౌరవించే సంస్కృతి మాదంటే చెప్పుకున్న వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చాక అధికార దర్పాన్ని కొద్దికొద్దిగా తలకెక్కించుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.తాజాగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ప్రభుత్వం మారినా మీరు మారలేదు. మీ తీరు మారలేదు. పద్ధతి మార్చుకోండి. లేకుంటే జిల్లా నుంచి మిమ్మల్ని పంపించేయాలంటే నాకు నిమిషం పట్టదు అంటూ ఫైర్ అయ్యారు.ఉద్యానవనశాఖ జాయింట్ డైరెక్టర్ సరస్వతి జిల్లాలో తమ శాఖ ప్రగతి గురించి నివేదిస్తున్న సమయంలో కల్పించుకున్న పెద్దిరెడ్డి మీ శాఖలో రాయితీలన్నీ డబ్బులకు అమ్మేశారు. ఎన్నోసార్లు ఫోన్లో హెచ్చరించా. అయినా మారలేదు. పద్ధతి మార్చుకో..లేకుంటే ఇబ్బంది పడతావ్. నిన్ను జిల్లా నుంచి పంపాలంటే నాకు నిమిషం పట్టదు అంటూ హెచ్చ రించారు.అంతటితో ఆగకుండా మూడు నియోజకవర్గాలకు ఒక్కసారిగా రూ.35 కోట్ల డ్రిప్ ఇరిగేషన్‌ను ఎలా మంజూరు చేస్తావంటూ ఏపీఎంఐపీ పీడీ విద్యాసాగర్ను ఏకవచనంలో సంబోధిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసారు.దీనిపై అధికారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా నీ వివరణ నాకు అవసరం లేదు కూర్చో అని గదమాయించారు. అధికారులను ఏకవచనంతో సంబోధిం చటం పైన ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో మంత్రి నారాయణస్వామి తొలుత అధికారుల ను గౌరవం గానే పిలిచినా.. తరువాత నువ్వు అనే సంబోధించడం పై అధికారులు నొచ్చుకున్నారు.గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు అధికారులను గౌరవించడం లేదంటూ ఆరోపణలు చేసిన ఇదే వైసీపీ మంత్రులు ఇప్పుడు చేస్తున్నదేంటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులతో హుందాగా,మర్యాదపూర్వకంగా మెలగాలంటూ వైఎస్ జగన్ సూచించినా మంత్రులు మాత్రం అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.అధికారులు తప్పులు చేసినట్లు అనిపిస్తే సరిచేసుకోవాలంటూ హుందాగా చెప్పాల్సింది పోయి ఇలా సభల్లో ఏకవచనంతో సంబోధించడమేమిటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి..