ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అగ్రనేతల్లో ఒకరైన సచిన్ అహిర్ గురువారం శివసేనలో చేరారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సమక్షంలో ఆయన సేన బావుటా చేతబట్టారు. ‘రాజకీయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని సచిన్ ఆ తర్వాత విలేఖరులతో అన్నారు. సచిన ఫిరాయింపు వల్ల వర్లి ప్రాంతంలో ఎన్సీపీ బలహీనం కానుందని మదింపు వేసారు. గతంలో ఆయన శివసేనకు బలమైన ప్రత్యర్థిగా ఉండేవారు. ఎన్సీపీ మరో సీనియర్ నేత చగన్ భుజ్బల్ కూడా సేనలో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయన గతంలో కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణం ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. శివసేన నుంచి ఎన్సీపీకి వెళ్లిన ఆయన్ను తిరిగి తమ పార్టీలో చేర్చుకోడానికి సేన సుముఖంగా లేదని సమాచారం.