న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏడాది తరువాత దీనికి గల కారణాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుటి అక్టోబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన శనివారం సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితుల్ని రాసారు. ‘నా రాజీనామాకు రెండు కారణాలున్నాయి. మొదటిది 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థనుంచి కేంద్రం పక్కకుపోవడం, రెండోది ఆర్థిక మంత్రితో సంబంధాలు బాగా లేకపోవడం. ఆర్థిక శాఖ కాకుండా మరో శాఖలో పని చేయదలచలేదు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ విధానాలపై సరియైన విధానాన్ని కలిగినవారు ఆమెతో పని చేయజాలరు. 10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంనుంచి కేంద్రం పక్కకుపోయింది. ఇది సాధ్యంకాదనే విషయం నాకు ప్రారంభంలోనే తేలింది. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి పని చేయడం వ్యక్తి గతంగా, వృత్తిపరంగా నాకు చాలా ఉత్తమమైనది. ప్రజా విధాన సమస్యల నాడిని అవగతం చేసుకున్న మాస్టర్ మైండ్ జైట్లీ. విధానాల అమలు, శాఖ నిర్వహణ తదితర అంశాలను ఆయన కార్యదర్శులకు విడిచి పెట్టేవారు. నిర్మలా సీతారామన్కు కూడా తనపై నమ్మకం ఉన్నట్టు అనిపించలేదు. చాలా అసౌకర్యంగా ఉన్నట్టు గుర్తించా. ముఖ్యంగా ఆర్ బీఐ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు, పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకం విషయాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన తేడాలు ఏర్పడ్డాయి. దీంతో బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోనే, 2019 జూన్లో నా బదిలీ కోసం సీతారామన్ పట్టుబట్టారు. జూలై 24 న విద్యుత్ శాఖకు బదిలీ అయిన అరగంటలో స్వచ్ఛంద పదవీ విరమణ దాఖలు చేశా. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాన’ని పేర్కొన్నారు.