నిఘా లేదు

న్యూ ఢిల్లీ : పెగసస్తో ప్రముఖల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలన్నీ తప్పని సమాఖ్య ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రెండు పుటల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై ప్రభుత్వం నిఘా ఉంచిందని కక్షిదార్లు చేస్తున్న ఆరోపణలు కేవలం కల్పితం, నిరాధారమని పేర్కొంది. పెగసస్ ఆరోపణలపై ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపింది. పెగసస్ అంశంలో అన్ని అంశాలను నిగ్గు తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని చెప్పింది. పెగసస్ స్పై వేర్ను ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతరులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించారన్న ఆరోపణల్ని ఖండించింది.
న్యాయపంచాయతీల నియామకంపై అసహనం
న్యాయపంచాయతీల నియామకంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏడాదిగా చెప్పిందే చెబుతోంది తప్ప ఆచరణ లేదని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పెదవి విరిచారు. గత వారం విచారణ సమయంలో తప్పక అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమైందని సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించారు. మరో రెండు వారాల సమయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానాన్ని కోరారు. ఇదే చివరి అవకాశం, మరోసారి ఇవ్వబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించింది. పది రోజుల్లోగా నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. కేసు విచారణ ఈ నెల 31న చేపట్టనున్నట్లు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos