న్యూఢిల్లీ : పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తులు మొత్తం పబ్లిక్ ఎగ్జామ్స్ వ్యవస్థనే నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. వీరివల్ల మిగిలిన అనేకమంది అభ్యర్థులు బాధపడుతున్నారని తెలిపింది. 2003లో వచ్చిన బాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం ‘మున్నాభారు ఎంబిబిఎస్’ను ప్రస్తావిస్తూ… ఆ చిత్రంలో మున్నాభారు తరపున మరొకరు పరీక్ష రాస్తారని, అలాంటి ‘మున్నాభారు లోపలే ఉండాలి’ అని పేర్కొంది. గతేడాది డిసెంబరు 15న ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటి టెస్టు (సిటిఇటి)లో ఒక అభ్యర్థికి బదులుగా మరొక వ్యక్తి పరీక్ష రాసాడని కేసు నమోదైంది. అభ్యర్థి సందీప్ సింగ్ పటేల్ స్థానంలో మరొక వ్యక్తి నకిలీ అడ్మిట్ కార్డు ఉపయోగించి పరీక్షకు హాజరైనట్లు పాఠశాల అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సందీప్ సింగ్‌కు బెయిల్ ఇవ్వడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దీంతో సందీప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ సందీప్‌నే చివాట్లు పెట్టింది. ఈ పిటిషన్‌పై స్పందన కోరుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. విచారణను నాలుగు వారాల తరువాతకు వాయిదా వేసింది.