ముంబై : కాంగ్రెస్ దేశానికి ఏం సేవ చేసింది? అని పదే పదే ప్రశ్నించే వారు ఒక సారి 1971 లో జరిగిన యుద్ధాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని శివసేన పత్రిక సామ్నా శుక్రవారం సంచికలో వ్యాఖ్యానించింది. ‘ఈ యుద్ధం ద్వారానే పాకిస్తాన్ నుంచి విడివడి బంగ్లాదేశ్ ఏర్పడింది. 1971 యుద్ధం అత్యంత ఉత్కంఠభరితమైంది. చాలా స్ఫూర్తిదాయకమైంది. మనం స్వర్ణోత్సవాన్ని జరుపు కుంటున్నాం. పాక్ తో యుద్ధం గెలిచిన సందర్భంగా మాజీ ప్రధాని ఇందిర జరిపిన దౌత్యాన్ని గుర్తు చేసుకోవాలి. వ్యూహాకత్మక నిర్ణయాలతో పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించాం. ఫీల్డ్ మార్షల్ మానిక్షా ఆధ్వర్యంలో పాక్పై విరుచుకుపడ్డాం. 13 రోజుల్లోనే పాక్ లొంగిపోయేలా చేశారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందని చిన్న పిల్లల మనస్తత్వంలా వాట్సాప్ యూనివర్శిటీ పదే పదే ప్రశ్నిస్తుంది. వారందరూ 1971 లో ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుంటుంది. చైనా, పాక్ లు రెండూ సరిహద్దుల్లో అల జడు లను సృష్టిస్తున్నాయి. లడఖ్ నుంచి చైనా బలగాలను ఉపసంహరించుకోవడం లేదు. పాకిస్తాన్.. ఎల్ఓసీ వెంట కాల్పుల విరమణ ఒప్పం దాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. 50 ఏళ్ల క్రితం పాక్ కు మంచి గుణపాఠం చెప్పారు. కానీ ఇప్పుడేమైంది? రాజ్యాంగ ప్రతిపత్తి 370 ఎత్తేసి సుమారు ఏడాది దాటింది. జమ్మూ కశ్మీర్ లో శాంతి అనేదే లేద’ని బీజేపీకి చురకలంటించింది.