ఈ సేల్స్‌మెన్‌ నక్క తోక తొక్కారు…

ఈ సేల్స్‌మెన్‌ నక్క తోక తొక్కారు…

తిరువనంతపురం : నగల దుకాణంలో వారు సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నారు. చాలీ చాలని జీతంతో బతుకు బండిని లాక్కొస్తున్నారు. బంగారు నగల దుకాణంలో పని చేస్తున్నాం, కదా…లక్ష్మీ కటాక్షం కలుగకపోతుందా అనే ఆశతోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. వారి కోరికను లక్ష్మీదేవి మన్నించినట్లుంది. కాకపోతే మరేమిటి…బుధవారం రాత్రి లాటరీ టికెట్టు కొన్నారు..గురువారం ఉదయం కోటీశ్వరులైపోయారు. కేరళలోని కొల్లం జిల్లాలో ఓ నగల దుకాణంలో రొన్ని, వివేక్‌, రాజీవ్‌, సుబిన్‌ థామస్‌, రింజిన్‌, రతీశ్‌ అనే వారు సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నారు. వీరంతా కలసి తలా రూ.50 చొప్పున వేసుకుని రూ.300తో కేరళ ఓనం  బంపర్‌ లాటరీ టికెట్టును కొనుగోలు చేశారు. మరుసటి రోజు ఫలితాలు వెలువడ్డాయి. వారు కొనుగోలు చేసిన టికెట్టుకు జాక్‌పాట్‌ తగిలింది. ఆ ఆరుగురూ రూ.12 కోట్లకు అధిపతులయ్యారు. ఈ టికెట్టును మొదట ముగ్గురే కొనుగోలు చేశారు. మరి కొద్ది గంటల్లో ఫలితాలు వెలువడుతాయనగా మరో ముగ్గురు భాగస్వాములయ్యారు. గెలుచుకున్న మొత్తంలో పన్నులు, ఇతర కత్తిరింపులు పోగా వారికి దక్కేది రూ.7.5 కోట్లు. ఎటు చూసినా, ఒక్కొక్కరికి రూ.కోటి దక్కుతుందని, మాలో చాలా మందికి అప్పులున్నాయని విజేతల్లో ఒకరు తెలిపారు. అయినప్పటికీ కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామంటూ తమ సేవా తత్పరతను చాటుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos