అమరావతి : ప్రభాస్ నటించిన సాహో చిత్రం టికెట్ల ధరలను ఇతర సినిమాల్లాగే నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మించినందున, నిర్మాతలు, పంపిణీదారులు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో టికెట్లను నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త కోర్టు దాకా వెళ్లడంతో, దీనిపై విచారణ జరపాలని హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ల ధరల పెంపునకు అనుమతిలేదని, ఎంత భారీ బడ్జెట్ చిత్రమైనా, ఏ హీరో అయినా ప్రభుత్వానికి అందరూ సమానమేనని తేల్చి చెప్పింది. టికెట్ల ధరను పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మరో వైపు ప్రభుత్వం ఈ సినిమా అదనపు షోలకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో తొలి వారంలో ఆరు షోలను ప్రదర్శించనున్నారు.