మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశ భక్తుడిగా కీర్తించిన బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోవర్ధన్ డంగి మాట్లాడుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో ప్రజ్ఞా ఠాకూర్ అడుగుపెడితే ఆమెను సజీవంగా తగలబెడతామని హెచ్చరించారు.లోక్ సభలో బుధవారం నాడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) బిల్లుపై చర్చ సందర్భంగా గాడ్సే కీర్తిస్తూ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో… కేంద్ర ప్రభుత్వం ఆమెను డిఫెన్స్ ప్యానల్ నుంచి తొలగించింది. అయినప్పటికీ, ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. మధ్యప్రదేశ్ భోపాల్ లోక్ సభ నియోజకవర్గానికి సాధ్వి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.