ముంబై: త్వరలో జరగనున్న ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా భారత జట్టుకు పెద్ద అండ కాగలడని టీమిండియా లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు అతడు సింహస్వప్నం అవుతాడని పేర్కొన్నాడు. గత కొన్ని నెలలుగా బుమ్రా తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న బుమ్రా.. 2018 ఐసీసీ టెస్టు, వన్డే జట్లలో చోటు కూడా సంపాదించుకున్నాడు. జట్టులో బుమ్రా టాప్ బౌలర్‌గా మారడం తనను ఆశ్చర్యపరచలేదని, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను సైతం అతడు ఇబ్బంది పెట్టగలడని సచిన్ పేర్కొన్నాడు. బుమ్రా ఎక్కువ సమయం తన ఎదుగుదల కోసం కృషి చేస్తాడని, తనను తాను మెరుగు పరుచుకునేందుకు నిజాయతీగా కష్టపడతాడని సచిన్ కొనియాడాడు. 2015 నుంచి తాను బుమ్రాను చాలా దగ్గరి నుంచి గమనిస్తున్నట్టు సచిన్ చెప్పుకొచ్చాడు.