తెరాసకు రెండు షరతులు..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది.గత ఏడాది డిశంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెదేపాతో పొత్తుపెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. శాసనసభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి,డీకే అరుణ తదితర,కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి హేమాహేమీలు ఓటమి చెందగా సబిత ఇంద్రారెడ్డితో పాటు మరో 18 మంది కాంగ్రెస్‌ నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.అయితే కొద్ది కాలంగా తెరాసలోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలయ్యాయి.ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు  కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకనేత సబిత ఇంద్రారెడ్డి కూడా తెరాసలో చేరనున్నట్లు వస్తున్న వార్తలతో కాంగ్రెస్‌ నేతలకు దిక్కుతోచడం లేదు.ఆదివారం ఉదయం టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో సబితాఇంద్రారెడ్డి – ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. దీంతో ఆమెను బుజ్జగించేందుకు ఆ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి – సీఎల్పీనేత భట్టి విక్రమార్క – సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి.. సబిత ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. పార్టీని వీడొద్దని – భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయని వారు వివరించారు. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో నాయకులు నిరాశతో వెనుదిరిగినట్టు తెలిసింది.కాగా తెరాసలో చేరడానికి సబిత ఇంద్రారెడ్డి తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముందు రెండు ప్రస్తావనలు ఉంచినట్లు సమాచారం.ఒకటి తన కుమారుడు కార్తిక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ సీటు రెండవది తనకు మంత్రివర్గంలో స్థానం.ఈ రెండు షరతులకు అంగీకరిస్తే తెరాసలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సబిత స్పష్టం చేసినట్లు సమాచారం.అయితే కార్తిక్‌రెడ్డికి లోక్‌సభ సీటు ఇవ్వడానికి అంగీకరించిన తెరాస సబితకు మంత్రివర్గంలో స్థానంపై ఎటువంటి హామీ ఇవ్వడం లేదని సమాచారం. ఏదేమైనా 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న,తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తమ ఘనతేనని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌కు తెలంగాణలో ఇటువంటి దుస్థితి రావడం కాంగ్రెస్‌ పార్టీకి ఇంతకంటే మించిన అవమానం మరొకటి లేదేమో..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos