తెరాసలో చేరికపై సబిత యూటర్న్‌?

తెరాసలో చేరికపై సబిత యూటర్న్‌?

పార్టీ ఫిరాయింపుపై
కాంగ్రెస్‌ మహిళ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.గత
ఏడాది డిశంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకటే సీటు ప్రాతిపదికన కాంగ్రెస్‌
పెద్దలు సబితకు టికెట్‌ ఇచ్చి సబిత కుమారుడు కార్తిక్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడానికి
నిరాకరించారు.ఎన్నికల్లో సబిత ఎమ్మెల్యేగా గెలిచినా తనకు టికెట్‌ దక్కకపోవడంతో కార్తిక్‌రెడ్డి
కాంగ్రెస్‌కు దూరంగా ఉండసాగారు.తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తామంటూ తెలంగాణ
సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఆశలు పెంచుకున్న సబిత కుమారుడు కార్తిక్‌తో సహా తెరాసలో
చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపించాయి.తనకు మంత్రి పదవి కుమారుడు కార్తిక్‌రెడ్డికి
చేవెళ్ల ఎంపీ సీటు ఇస్తే తెరాసలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సబిత తెరాస వర్కింగ్‌
ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో చెప్పినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటికే ముగ్గరు,నలుగరు
ఎమ్మెల్యేలు తెరాసలో చేరడంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి గురించి బెంగపెట్టుకున్నకాంగ్రెస్‌
అధిష్టానం సబిత కూడా కారెక్కనున్నట్లు వచ్చిన వార్తలతో వెంటనే అప్రమత్తమై సబితను బుజ్జగించడానికి
ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించింది.అధిష్టానం సూచన మేరకు సోమవారం రాత్రి
సబిత ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి గంటకుపైగా సబితతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.ఈ
క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో స్వయంగా కార్తిక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ
సీటు ఇస్తామంటూ హామీ ఇప్పించినట్లు సమాచారం.రాహుల్‌ హామీతో చేవెళ్ల చెల్లెమ్మ వెనక్కి
తగ్గారని పార్టీ మారబోనంటూ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కాంగీయులు తెలుపుతున్నారు.రాహుల్‌గాంధీతో
చర్చలు జరపడానికి మంగళవారం సబిత కుమారుడు కార్తిక్‌రెడ్డితో సహా ఢిల్లీకి పయనమయ్యారు.సబితను
తెరాసలో చేర్చుకొని కాంగ్రెస్‌కు భారీషాక్‌ ఇవ్వడానికి కేసీఆర్‌ వేసిన ఎత్తుగడను రేవంత్‌రెడ్డి
విజయవంతంగా భగ్నం చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos