ముంబై: ‘అమర జవాన్ల త్యాగాలను చూపించి ఓట్లు అడిగేవారు దోషుల కిందే లెక్క. వైమానిక దాడులకు ఆధారాలు అడగడం కూడా మన సైనిక సామర్థ్యాన్ని అవమానించడమేన’ని శివసేన వాణి మరాఠి పత్రిక -సామ్నా వ్యాఖ్యానించింది.‘రాజకీయ ప్రత్యర్థులను దేశ ద్రోహులు అంటూ నిందించడం బాధ్యతా రాహిత్యం. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై జరిపిన వైమానిక దాడుల ఘనతను సైన్యానికి కాకుండా తమ ఖాతాలో వేసుకునే రాజకీయ నాయకులు సంఖ్య పెరిగిపోతోంది’ అని దుయ్యబట్టింది. ‘చాలామంది బీజేపీ నేతలు సైనిక దుస్తులు ధరించి ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీ ఎంపీ మనో్జ్ తివారీ ఇటీవల సైనిక దుస్తుల్లో వెళ్లి, బీజేపీకి ఓట్లేయాలంటూ అడిగారు. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ ప్రయోజనాల కోసమే వైమానిక దాడులు చేశారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనన్న భావన కలుగు తోంద’ని పేర్కొంది. బీజేపీ, శివసేన పరస్పరం ప్రకటనల కత్తులు దూసుకుంటున్నా రెండింటి మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. మహారాష్ట్రలోని 23 లోక్‌సభ స్థానాల్లో శివసేన, 25 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి.