రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతున్నాయి

రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతున్నాయి

న్యూ ఢిల్లీ : రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత చమురు రంగ సంస్థలు నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయదని ట్రంప్ మరోసారి చేసిన వ్యాఖ్యలకు కూడా కౌంటర్ వచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. ధరలు, క్రూడ్ రకం, లాజిస్టిక్స్‌ సహా ఇతర ఆర్థిక అంశాలను అనుసరించి చమురు రంగ సంస్థలు ముడిచమురు కొనుగోలు చేస్తాయని తెలిపాయి. ‘భారత్‌ 85 శాతం ఇంధనం దిగుమతి చేసుకుంటోంది. రష్యా చమురు కొనుగోళ్లపై అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు లేవు. -సెవన్‌, ఐరోపా సమాఖ్యలు మాత్రం నిర్దేశిత ధరల్లోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని చెప్పాయి. ఆ రెండు కూటములు నిర్దేశించిన ధరల్లోనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ముడిచమురు ధరలు స్థిరంగా ఉండేలా చూస్తోంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుండా ఉంటే అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర 137 డాలర్లుకు చేరేది. రష్యా ఉత్పత్తి చేసే LNGలో 51 శాతాన్ని ఐరోపా సమాఖ్యనే దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, వెనిజువెలాపై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేయట్లేదు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి భారత్​ చమురు కొనుగోలు చేయడంపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాలవి పతనమైన ఆర్థిక వ్యవస్థలని విమర్శించారు. మరోవైపు భారత్‌ చమురు కొనడం వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోందని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఆంక్షల వల్ల అక్కడ చమురు చౌకగా లభిస్తోందని, దురదృష్టవశాత్తూ అదే యుద్ధంలో రష్యా మనుగడకు ఉపయోగపడుతోందని అన్నారు. దీనిపై ఇప్పటికే భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ స్పందించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకువెళ్తామన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos