
ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి క్రమంగా బలోపేతమవుతోంది. సోమవారం ఉదయం డాలరుతో మారకంలో 68.91కు చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో వరుసగా ఆరవ రోజు కూడా బలపడి ట్రేడింగ్ ప్రారంభంలోనే 19 పైసలు లాభపడి తన జోరును కొనసాగించింది. అనంతరం మరింత ఊపందుకుని 43 పైసలు(0.32 శాతం) ఎగసి 68.67ను చేరింది. నిరుడు ఆగస్టు 10న రూపాయి ఈ స్థాయికి చేరింది. గత వారమంతా రూపాయి లాభాలతో కొనసాగి వరుసగా ఐదో రోజు శుక్రవారం రూపాయి 24 పైసలు పుంజుకుని 69.10 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 69.03 వరకూ బలపడింది. దీంతో గత ఐదు రోజుల్లో రూపాయి ఏకంగా 104 పైసలు లాభ పడటం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ బహిరంగ విపణి లావాదేవీల ద్వారా వ్యవస్థలోకి నగదును సమకూరుస్తోంది. విదేశీ మారక స్వాపింగ్ ద్వారా ఐదు బిలియన్ డాలర్లను విడుదల చేయనున్నట్లు గత గురువారం రిజర్వ్ బ్యాంకు తెలిపింది.ఇవన్నీ రూపాయి బలోపేత మయ్యేందుకు దోహద పడుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. దిగుమతుల తగ్గు ముఖంతో వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం కూడా మరో కారణం. ఫిబ్రవరిలో ఈ లోటు 17నెలల అత్యల్ప స్థాయికి చేరింది. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడంతో దిగు మతులు తగ్గాయి. ఫిబ్రవరి వాణిజ్యలోటు 9.60 బిలియన్ డాలర్లు .అంతకు ముందు జనవరిలో ఇది 14.7 బిలియన్ డాలర్లు. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారీ పెట్టుబడుల వల్ల ఈక్వీటీ మార్కెట్లు భారీ లాభాల్ని నమోదు చేస్తున్నాయి. . తాజాగా సోమవారం ఉదయం సెన్సెక్స్ 259 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 75 పాయింట్లు పుంజుకుని 11500 స్థాయికి ఎగువ ట్రేడ్ అయ్యింది.