ఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ధరలపై వచ్చిన ఆరోపణల కేసుకు సంబంధించి వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికార రహస్యాల చట్టం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తుందని పేర్కొంటూ ఇందులోని 22, 24 సెక్షన్లను సమర్థిస్తున్నట్లు విస్పష్ట ప్రకటన చేసింది. ఈ సెక్షన్ల కింద ఇంటెలిజెన్స్, భద్రతా సంస్థలు సైతం అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి తీరాల్సి ఉంటుంది. రహస్య పత్రాలకు సమాచార హక్కు చట్టం వర్తించదని అటార్నీ జనరల్ కేకే. వేణుగోపాల్ విన్నవించినప్పుడు కోర్టు పైవిధంగా స్పందించింది. దేశ భద్రత పేరిట గతంలో ఈ సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించగా, వాదనల సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి కేఎం. జోసెఫ్ సమాచార హక్కు చట్టం గురించి విశదీకరించారు. మరో వైపు హోం మంత్రిత్వ శాఖ నుంచి చోరీ అయిన లీకైన పేజీలను, కాగ్ నివేదికను రివ్యూ పిటిషన్ నుంచి తొలగించాలని వేణుగోపాల్ కోర్టును అభ్యర్థించారు.